CMPF SCAM IN KOTHAGUDEM

సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో గత మూడు నెలల నుంచి ఉద్యోగ విరమణ కార్మికులకు భవిష్య నిధి అందడం లేదు. ఒక నెలలో ఉద్యోగ విరమణ చేసే కార్మికుడికి అదే నెలలో లెక్కను పూర్తిచేసి సీఎంపీఎఫ్‌(భవిష్య నిధి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఆనవాయితీగా వస్తోంది. కానీ జులై నెలాఖరు నుంచి అక్టోబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఇప్పటివరకు భవిష్య నిధి లెక్కలు తేలలేదు. ఈమధ్య కాలంలో కొత్తగూడెం నుంచి సుమారు 70 మంది, మణుగూరు నుంచి 67, ఇల్లెందు నుంచి 30 మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. ఈ నెలలో కూడా రీజియన్‌లో సుమారు 50 మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు. సమస్య సింగరేణి డైరెక్టర్ల వరకు వెళ్లినా పరిష్కారం చూపకపోవడం గమనార్హం.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భవిష్య నిధి లెక్కల్లో తేడాలు వస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి యాజమాన్యం ఇచ్చిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని భవిష్యనిధి అధికారులు తాత్కాలికంగా అందజేతను నిలిపివేశారు. ఈ ప్రభావం కార్మికులపై పడుతోంది. వారు పర్సనల్‌ అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. పర్సనల్‌ అధికారులు భవిష్య నిధి అధికారులపై సింగరేణి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదిలాఉండగా ప్రతీ ఏరియాలో మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన భవిష్య నిధి సమావేశాలను కూడా నిర్వహించడం లేదు. ఉన్నకొద్దీ సమస్య జఠిలంగా మారింది. ఈసమస్య త్వరితగతిన పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో మరింతమంది కార్మికులు ఇబ్బందిపడనున్నారు. భవిష్యనిధి లెక్కలు పేరుకుపోతే ఆలస్యంజరిగే ఆస్కారం ఉంది.

దిగాలు పడుతున్నారు… దిగిపోయిన కార్మికులకు భవిష్య నిధి రాకపోవడంతో కొందరు ఇళ్ల నిర్మాణంను నిలిపివేశారు. ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలను తాత్కాలికంగా ఆపేశారు. మరోపక్క కొన్ని ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 35 ఏళ్లు ఆ పైబడి సింగరేణిలో కష్టపడి పనిచేసినా.. ఆ తర్వాత ఉద్యోగం నుంచి దిగిపోయినా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు కార్మికులు అప్పులు చేసుకుంటున్నారు. కష్టించిన ఫలితం సక్రమంగా ఇవ్వకపోవడం కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సింగరేణి డైరెక్టర్లస్థాయి అధికారులు ఈ సమస్యను తీవ్రంగా తీసుకోవాల్సి ఉంది.

Tags:Singareni,cmpf,scam

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *