Election update Bhadradri Kothagudem

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే తెరాస అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. గులాబీ రేసుగుర్రాలు కార్యక్షేత్రంలోకి దిగి తమ విజయావకాశాలు మెరుగుపరచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. తెరాస అభ్యర్థి బలాలు ఏమిటీ? బలహీనతలు ఏమిటీ? ఎవరిని ప్రత్యర్థిగా నిలిపితే పోటీలో విజయం సాధిస్తామన్న సమాలోచనలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. సిట్టింగు స్థానాలతోపాటు ప్రతిపక్ష స్థానాలను కైవసం చేసుకోవాలన్న భావనతో తెరాస రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. తెరాస అధినేత కేసీఆర్‌ కనుసన్నల్లో ఉభయ జిల్లాల్లో పావులు కదుపుతుండగా.. ప్రతిపక్ష పార్టీల అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయా పార్టీల నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో నేడు(శనివారం) సమావేశం ఉండడంతో తెదేపా ముఖ్యనేతలంతా హైదరాబాద్‌ వెళ్లగా.. కాంగ్రెస్‌  అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మిగతా పార్టీలు అదే పనిలో నిమగ్నమయ్యాయి

పూర్వ ఖమ్మం జిల్లాలో రాజకీయాలు జోరుమీదున్నాయి. రెండు జిల్లాల్లో 10 శాసనసభా స్థానాల్లో ఆరు స్థానాలకు గట్టిపోటీ ఏర్పడే అవకాశాలున్నాయి. మరో మూడు చోట్ల ఏకపక్షంగా అభ్యర్థుల విజయావకాశాలున్నాయి. మిగిలిన ఒక స్థానం ప్రత్యర్థి పార్టీ నిలిపే అభ్యర్థిని అనుసరించి ఫలితాల్లో మార్పులుంటాయి. ఉభయ జిల్లాల్లో ప్రధాన పార్టీల పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉంది.

ఎన్నికల బరిలో తెరాసకు చెందిన ఏడుగురు తాజా మాజీ ఎమ్మెల్యేలున్నారు. వీరితోపాటు మరో మూడుచోట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానాలపై తెరాస అధిష్ఠానం దృష్టి సారించింది. మొత్తం స్థానాల్లో విజయబావుటా ఎగరేయాలన్న లక్ష్యంతో గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి బరిలో దిగుతుండగా, ట్రైకార్‌ ఛైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట నుంచి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి పోటీకి చేస్తున్నారు. వీరితోపాటు మిగతా 07 మంది ప్రచార కార్యక్రమాలకు తెరతీశారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ
అజయ్‌కుమార్‌ శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిగతా చోట్ల పార్టీ ప్రకటించిన అభ్యర్థులు తమ అనుచరులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు, సమీక్షల్లో నిమగ్నమయ్యారు. ఉభయ జిల్లాల్లో పార్టీని విజయపథాన తీసుకువెళ్లాల్సిన బాధ్యత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీదుంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు కూడా తమవంతు సహకారం అందించేందుకు కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మొత్తం స్థానాలు గెలుచుకుంటే ఉభయ జిల్లాలను మరింత అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. ఆ దిశగా నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. మధిర, పినపాక, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో తెరాస నేతల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతోంది. ఆ ప్రభావం ఎన్నికల సమయంలో చూపితే అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురుకావచ్చు. మధిర, పినపాక, సత్తుపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఒకేతాటిపైకి తీసుకురావాల్సి ఉంది. మిగతా పార్టీలకంటే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో తెరాస ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచింది.

కాంగ్రెస్‌లో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే నేతలు ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని నియమించలేకపోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు వనమా వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు ఆ పార్టీలో ఉన్నారు. స్పష్టంగా చెప్పాలంటే ఉభయ జిల్లాల్లో రెండు, మూడు గ్రూపులుగా కాంగ్రెస్‌ విడిపోయింది. ఫలితంగానే మిగతా జిల్లాల మాదిరి డీసీసీ అధ్యక్షుడిని కూడా నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా నేతలందరూ తమ గ్రూపు రాజకీయాలను దూరంగా పెట్టి  పార్టీ విజయం కోసం సమష్టిగా పని చేయాలని శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్వ ఖమ్మం జిల్లాల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంది. తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న జిల్లాలో పూర్వ ఖమ్మం ఒకటి. అలాంటి పరిస్థితిలో మరింత కష్టపడితే మంచి ఫలితాలుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు బస చేసి 10 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఆ నివేదిక ఫలితాల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపులు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల సమయంలోనైనా నేతలంతా ఒకతాటిపై నిలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన పార్టీ తెదేపా. ఇప్పటికీ తమ బలం చెక్కుచెదరలేదని, బలమైన క్యాడర్‌ పార్టీ వెంట ఉన్నారని తెలుగు తమ్ముళ్ల చెబుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు 2009, 2014 సాధారణ ఎన్నికల సమయంలో తెదేపాను ఆశీర్వదించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు ఉభయ జిల్లాల తెదేపాకు పెద్దదిక్కుగా మారారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా కోనేరు సత్యనారాయణ(చిన్ని), తుళ్లూరి బ్రహ్మయ్యలను నియమించుకున్నారు. తెదేపా నుంచి ఎక్కువ మంది నేతలు తెరాస, కాంగ్రెస్‌ పార్టీలోకి వలస వెళ్లడంతో పలు నియోజకవర్గాల బాధ్యులు కూడా లేకుండాపోయారు. ఖమ్మం నియోజకవర్గం ఇన్‌ఛార్జి నియామకం విషయంలో వివాదం కొనసాగుతోంది. వైరా, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జిలు లేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ వారందరినీ ఒకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం నెలకొంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను కూడా ఈపాటికే నియమించాల్సింది. కానీ పూర్తిచేయలేకపోయారు. అయినప్పటికీ ఇటీవల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన మినీ మహానాడుకు జిల్లా నలుమూలల నుంచి జనం అధికంగా తరలిరావడం గమనించాల్సిన అంశం. ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లో పోటీకి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని

పార్టీ అగ్రనేతలు ఉన్నారు.
ఖమ్మం ఖిల్లా అంటేనే కమ్యూనిస్టులు. ప్రజాసమస్యలపై గళం ఎత్తే గొంతుకలు ఎర్రసైనికులు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో సీపీఎం నుంచి పోటీ చేసిన భద్రాచలం అభ్యర్థి సున్నం రాజయ్య ఒక్కరే విజయం సాధించారు. సీపీఐ నుంచి ఎవరికి కూడా సభలో అడుగుపెట్టే అవకాశం లభించలేదు. ఇల్లెందు ప్రాంతంలో న్యూడెమోక్రసీ పార్టీకి  బలం ఉంది. పూర్వగుండాల మండలాన్ని పినపాక నియోజకవర్గంలో కలపడంతో ఇల్లెందు నుంచి సభలో అడుగుపెట్టే అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఎన్డీకి పటిష్ఠమైన కార్యకర్తలు, దిశానిర్దేశం చేసే నేతలు ఉండటం విశేషం. సీపీఎం ఈ దఫా ఎన్నికల్లో భద్రాచలం, మధిర, పాలేరు తదితర స్థానాలపై కన్నేసింది. అయితే భద్రాచలం తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గం వెళ్తాడన్న ప్రచారం సాగుతోంది. రాజయ్య స్వస్థలం వీఆర్‌పురంలోని సున్నంవారిపెంట గ్రామం కావడం ఈ వాదనకు అవకాశం కల్పిస్తుంది. ఇదే విషయమై రాజయ్య మాత్రం పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెబుతున్నారు. రాజయ్య రంపచోడవరం వెళ్లడానికి ఇష్టపడితే భద్రాచలం నుంచి మాజీ ఎంపీ మిడియం బాబురావు శాసనసభ స్థానానికి పోటీపడే వీలుంది. మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్‌ను 2014 సాధారణ ఎన్నికల సమయంలో నిలబెట్టింది. తదనంతర పరిణామాల్లో సీపీఎంను కమల్‌రాజ్‌ వీడి తెరాసలో చేరారు. దీంతో  సీపీఎం తమ అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. సీపీఐ నేతలు ఖమ్మం, కొత్తగూడెం, వైరా తదితర నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అశ్వారావుపేట, ఇల్లెందు తదితర నియోజకవర్గాల్లో పోటీకి ఎన్డీ నాయకులు ఆసక్తి ఉన్నారు.

ఉభయ జిల్లాల్లోని సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని భాజపా యోచిస్తోంది. శాసనసభా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భద్రాచలం రాములవారి సన్నిధిలోనే రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్న భావనతో సుమారు ఆరు నెలల కిందట రెండు రోజులపాటు భద్రాచలంలో అంతర్గత సమావేశాలు నిర్వహించాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి జిల్లా పర్యటనలకు వచ్చారు. ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులను నియమించడంతోపాటు ప్రజాఆందోళనలు ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. భాజపా ఏయే స్థానాల నుంచి పోటీ చేస్తుందన్న విషయంపై త్వరలో స్పష్టత రానుంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతేడాది కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు రోడ్‌షో నిర్వహించి, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జనసేన ఏయే స్థానాల్లో తమ అభ్యర్థులను నిలుపుతుందో వేచిచూడాలి. వైకాపా కూడా పోటీపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాలి. తెలంగాణ జన సమతి అధ్యక్షుడు కోదండరాం కూడా ఉభయ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై ఆందోళన నిర్వహించారు. కోదండరాం నేరుగా కొందరితో టచ్‌లో ఉంటూ తమ పార్టీ అభ్యర్థులుగా నిలపాలని పలువురిని కోరుతున్నారు. మరికొందరు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో పోటీకి తెజస ఆసక్తి కనబరుస్తోంది.పొత్తులు తేలితేనే.. తెరాస తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి పెరిగింది. ఉభయ జిల్లాల విషయానికి వస్తే తెరాస అభ్యర్థిని ఢీకొట్టే వారు ఎవరన్న విషయంపై ప్రధానంగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌, తెదేపా పొత్తులపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ తెదేపా నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు (శనివారం) హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొత్తులు ఉంటాయా? స్నేహపూర్వక పోటీలు ఉంటాయా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.  మరోపక్క బీఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో ఖమ్మం, మధిర తదితర ప్రాంతాల్లో పోటీకి పలువురు సిద్ధమవుతున్నారు. బీఎల్‌ఎఫ్‌తో ఏయే పార్టీలు జతకడతాయన్న విషయంలో త్వరలో స్పష్టత రానుంది.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *