Grand Celebrations of Seetharama Kalyanam at Bhadrachalam

కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాసికం నుదుటన కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెళ్లి కూతురైన సీతమ్మను చూసి తరించారు. కురులను దువ్వి.. సొంపుగ నామం తీర్చి.. చెంపపై చుక్కను పెట్టి.. పెళ్లి కొడుకైన రాముడు ప్రత్యక్షమవ్వడంతో భక్తజనం సాష్ఠాంగ పడింది. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతిమదిని పులకరింపజేసింది. అక్షితలు జానకి దోసిట కెంపుల పోగయ్యాయి. రాముడి దోసిట పడి నీలపు రాసైన అక్షితలు లక్షింతలు కావడంతో భక్తకోటి మురిసింది. సీతారాముల కల్యాణోత్సవంతో ముల్లోకాలు మురవగా భూలోకమంతా పండుగైంది.

భద్రాద్రి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండమైన వేడుక శ్రీరామనవమి. బుధవారం ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలు వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంలో తేలియాడారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే శ్రీరామ నామాలు మార్మోగాయి. కౌసల్యా సుపుత్రుడికి సుప్రభాతం పలికి ఆరాధన జరిపి మూలవరులకు అభిషేకం చేశారు. సంప్రదాయబద్దంగా ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. ఆ సమయంలో సాగిన మంత్రోచ్చరణలతో భద్రగిరి పులకించింది. కల్యాణమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి జయజయ నీరాజనాల మధ్య మాడవీధిలో వూరేగింపుగా మిథిలా మండపానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో స్వామివారి పల్లకిని తాకేందుకు భక్తులు అమితాసక్తి కనబర్చారు. మిథిలా ప్రాంగణం నుంచి వీనులకు విందు చేస్తున్న వ్యాఖ్యానాలు, ప్రవచనాలు భక్తులను తన్మయులను చేశాయి.

ప్రతీ ఘట్టం.. మధురాతి మధురం
సీతారాముల కల్యాణం లోక కల్యాణం. చక్కని సీతమ్మ.. చల్లని రామయ్య పెళ్లి ప్రతీ ఒక్కరికి ఆనందదాయమని వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు చేసిన ప్రవచనం ఓలలాడించింది. కల్యాణమూర్తులు మిథిలా మండపంలోకి వేంచేయడంతో ఈ ప్రాంగణానికి సరికొత్త శోభ వచ్చింది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ సంబరం కళ్లెదుట సాక్షాత్కారమైంది. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విశ్వమంతా వీక్షిస్తుండగా క్రతువులోని ఒక్కో ఘట్టాన్ని వైదిక పెద్దలు నిర్వహించారని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. హేవళంబి సంవత్సరం ఎంతో గొప్పదని, రామానుజాచార్యుల వారి వెయ్యేళ్ల ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో జరిగే కల్యాణం ఎంతో విశేషమైందని వేదపండితులు ప్రవచించారు. శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన విష్వక్సేనుల వారిని అర్చకులు ఘనంగా ఆరాధించారు. పుణ్యాహవాచనం చేసి పుండరీకాక్ష మంత్రాన్ని పఠించారు. సీతారాముల కన్నబిడ్డలం మనమంతా. జగదానంద కారుకుడి జగమంత కుటుంబం మనం అంటూ సుభాషించారు. ఆ మూర్తులకు శరణాగతులం కావడమే ఆత్మ నివేదనగా అభివర్ణించారు. ఇలాంటి గొప్ప కల్యాణం వీక్షించడం వరమని అన్నారు. కన్యావరుణ చేసి సీతమ్మకు యోక్త్రధారణ నిర్వహించి రాముడికి యజ్ఞొపవీత ధారణ జరిపారు. ప్రవరను పఠించారు. గోత్ర నామాల విశిష్టతను వివరించి జై శ్రీరామ నామాలను పఠించారు. అభిజిత్‌ లగ్నంలో సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లాన్ని ఉంచారు. ఈ మహత్కార్యం భక్తులను పులకింపజేసింది. జగమంతా ఎదురు చూస్తుండగా మూడుముళ్ల బంధం నిర్వహించారు. సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగల్యధారణ జరిగింది. పితృ వాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మూడో మంగళ పతకం ఈ కల్యాణంలో ప్రత్యేకతను చాటింది. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అక్షిత. వీటిని వాడుక భాషలో అక్షింతలు అని అంటుంటారు. ఈ తలంబ్రాల వేడుక నయనానందంగా సాగింది. ముత్యాలతో కలిపి ఉన్న తలంబ్రాలు స్వామివారి మీద పడగానే ప్రాంగణంలో ఉన్న వారంతా పెద్ద పెట్టున జైశ్రీరాం అంటూ తమ సంతోషాన్ని చాటారు. ఈ తలంబ్రాలను ఎలాగైనా తీసుకోవాలన్న కుతూహలం భక్తుల్లో కనిపించింది. కల్యాణం తర్వాత స్వామివారు దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ రాజభోగం జరిపి ఆరాధన నిర్వహించారు. చంద్రప్రభ వాహనంపై సాగిన తిరువీధి సేవలో నూతన దంపతులకు అడుగడుగునా హారతులు అందించారు. తమకు కలిగిన భాగ్యానికి భక్తులు ఉప్పొంగిపోయారు. కొబ్బరి కాయలు కొట్టి పల్లకీ కింద నుంచి వెళ్లేందుకు ఆసక్తి కనబర్చారు. ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags:Sri Ramanavami celebrations,bhadrachalam,bhadradri,kothagudem

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *