Heavy Water Plant,Aswapuram was shut down

మే నెలలో ఎండలు తీవ్రం కావడం, ప్రవాహం లేకపోవడం.. తదితర కారణాలతో కుమ్మరిగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గింది. ఇన్‌టేక్‌వెల్‌లో ప్రస్తుతం కనీస పరిమాణంలో కూడా జలాలు లభ్యం కావడం లేదు.

Heavy Water Plant
Heavy Water Plant

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ, ఆసియాలో పెద్దదైన మణుగూరు భారజల కర్మాగారం(హెవీవాటర్‌ ప్లాంట్‌)ను ఈనెల 11 సాయంత్రం నుంచి షట్‌ డౌన్‌ చేశారు. నీరు అందుబాటులో లేక ప్లాంటును తాత్కాలికంగా మూసివేయడం 28 ఏళ్ల కర్మాగార చరిత్రలో ఇదే తొలిసారి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్లాంటు యాజమాన్యం జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ముంబయిలోని కర్మాగార ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు లేఖలను పంపింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై 165 ఏళ్ల కిందట సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆనకట్ట నిర్మించారు. ఇక్కడ నిత్యం జలాలు నిల్వ ఉంటాయి. వీటి ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగం మణుగూరు భారజల కర్మాగార నిర్మాణాన్ని 1982లో ప్రారంభించింది. 1991 జనవరిలో ఉత్పత్తిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏడాదికి 185 టన్నుల భారజలం ఉత్పత్తి అవుతోంది. అణుశక్తి రియాక్టర్లలో మితకారిణిగా, వైద్య, రసాయన రంగాల్లో ప్రయోగాలకు భారజలాన్ని వినియోగిస్తారు. కేవలం ‘గోదావరి నిత్య ప్రవాహం’ ఆధారంగానే ఏర్పాటైన ఈ ప్లాంటు కోసం సముద్రమట్టానికి 45 అడుగుల లోతులో ఇన్‌టేక్‌ వెల్‌ను నిర్మించారు. గంటకు 1800 మెట్రిక్‌ క్యూబ్‌ల జలాలను నది నుంచి రెండు మోటర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. గంటకు 1500 మెట్రిక్‌ క్యూబ్‌ల జలాలను భారజలం ఉత్పత్తి ప్రక్రియకు వినియోగించుకుంటారు. ప్రస్తుతం గోదావరి జలాలు అందుబాటులోలేని పరిస్థితుల్లో కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని శనివారం సాయంత్రం ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు లేఖలను ప్రభుత్వం, కర్మాగార ఉన్నతాధికారులకు పంపారు. ప్రత్యామ్నాయ చర్యలకు సహకరించాలని కోరారు.

నదిలో ప్రత్యేక కాలువలు
భారజల కర్మాగారంలో పనిచేసే ఉద్యోగుల కోసం నిర్మించినదే అశ్వాపురంలోని గౌతమీనగరం. ఇక్కడి జనాభా సుమారు 5 వేలు. ఈ కాలనీ అవసరాలకూ గోదావరి జలాలనే సరఫరా చేస్తున్నారు. గౌతమీనగరం నీటి అవసరాలను తీర్చేందుకు అధికారులు గోదావరిలోని అడుగు జలాలను ఇన్‌టేక్‌ వెల్‌ వద్దకు తరలించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం భారీ యంత్రాలను తెప్పించారు. నదిలో ఆదివారం నుంచి ప్రత్యేక కాలువల తవ్వకాల్ని ప్రారంభించారు. గోదావరి నదీ గర్భంలో రాళ్ల గుట్టలు అత్యంత సమస్యాత్మకంగా మారినా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడాలని మణుగూరు భారజల ప్లాంటు సీజీఎం జితేంద్ర శ్రీవాత్సవ గౌతమీనగరం ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

Check Also

kondapuram

New Mine in Singareni-Kondapuram

కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌ గని సింగరేణికే తలమాణికంగా నిలవనుంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించిన నూతన గనులలో ఇది ఒకటి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *