Kothagudem to Sathupalli Railway Line with 300 Crores

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్తగూడెం(భద్రాచలం రోడ్)-సత్తుపల్లి రైల్వే లైన్‌కు మోక్షం లభించింది. రైల్వే బడ్జెట్‌లో శుక్రవారం నాడు కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించనున్న రైల్వే లైన్‌ను సింగరేణి బొగ్గును రవాణా చేసేందుకు దోహదపడనుంది. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలో సత్తుపల్లి వరకు రైల్వే లైన్‌ను మంజూరు చేస్తూ నిధులను కేటాయించడంతో కొవ్వూరు వరకూ నిర్మించనున్న రైల్వే లైన్‌కు ముందడుగు పడినైట్లెంది. సత్తుపల్లి నుంచి జంగారెడ్డి గూడెం మీదుగా కొయ్యలగూడెం, నిడదవోలు మీదుగా కొవ్వూరు వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగితే సుమారు 40 సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్‌కు కూడా మోక్షం లభించినట్లవుతుందని రైల్వే ప్రయాణీకులు, జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ రైల్వే లైన్ నిర్మాణంలో మొదటి దశగా సత్తుపల్లి వరకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి సంస్థ సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఈ బొగ్గును రవాణా చేసేందుకు రోడ్డు మార్గం ద్వారా లారీలను వినియోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నియమ, నిబంధనల ప్రకారం బొగ్గు రవాణా రోడ్డు మార్గం మీదుగా ఎక్కువ దూరం చేయడానికి వీల్లేదు. రైలు మార్గం ద్వారానే చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. ఇందుకు తగిన విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని దశల వారీగా దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సంప్రదింపులు జరుపుతూ సర్వేకోసం సింగరేణి నిధులను కూడా ఇచ్చింది. రెండు విడతలుగా సర్వే జరిగింది. తొలుత ప్రస్తుతంకొత్తగూడెం నుంచి రుద్రంపూర్ సింగరేణి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వరకు నడుస్తోన్న రైల్వే లైన్‌కు అనుబంధంగా రుద్రంపూర్ నుంచి ఆనందఖని మీదుగా అన్నపురెడ్డిపల్లి, యర్రగుంట, దమ్మపేట మండలాలను కలుపుతూ రైల్వే లైన్‌ను సత్తుపల్లి వరకు నిర్మించాలని యోచించారు.

కానీ దీని వల్ల దూరాభారం పెరగడంతో పాటు గౌతంఖని ఓపెన్‌కాస్ట్‌ను విస్తరించే క్రమంలో రైల్వే లైన్ నిర్మాణానికి భవిష్యత్తులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున, రైల్వే లైన్ నిర్మాణం శాశ్వత ప్రాతిపదికపై జరగాల్సి ఉన్నందున మళ్లీ రీ సర్వే చేయాలని నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే చేసిన సర్వే వల్ల నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందని భావించి రైట్స్ సంస్థకు తిరిగి సర్వే బాధ్యతను అప్పగించారు. రైట్స్ సంస్థ చేసిన సర్వే ఆధారంగా దూరాభారం తగ్గడంతో పాటు నిర్మాణ వ్యయం కూడాతగ్గిందని అంచనాకు వచ్చారు.
సర్వే కోసం రూ.6.38 కోట్లు

సింగరేణి సంస్థ ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు 2012 ఆగస్టు 6వ తేదీన అప్పటి సీఎండీ సుతీర్థ భట్టాచార్య చేతుల మీదుగా రూ.6.38 కోట్లను అందజేసింది.

బొగ్గు రవాణాకు మార్గం సుగమం

సింగరేణి సంస్థ సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ నుంచి వెలికి తీసిన బొగ్గును కొత్తగూడానికి రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తోంది. దీని వల్ల రవాణా వ్యయం తలకు మించిన భారంగా ఉంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం త్వరిత గతిన పూర్తైతే సత్తుపల్లి జేవీఆర్ ఓసీ నుంచి నేరుగా బొగ్గును ఆయా సంస్థలకు రైలు మార్గం ద్వారా రవాణా చేసేందుకు సౌకర్యంగా మారనుంది. రవాణా వ్యయం కూడా తగ్గడంతో పాటు రైల్వేకు ఆదాయం, సింగరేణికి రవాణా ఖర్చులు ఆదా కానున్నాయి. ఈ రైల్వే లైన్ మంజూరుతో పాటు నిధులు కేటాయించడంతో సింగరేణితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు, సత్తుపల్లి ప్రాంత వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి అనుసంధానమైన భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరుగుతూ వస్తున్నాయి. కొదమసింహం పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో కొత్తగూడెం వయా సత్తుపల్లి మీదుగా కొవ్వూరు వరకు రైల్వే లైన్ నిర్మించాలని కొవ్వూరు వరకు పాదయాత్రను కూడా చేశారు.

సింగరేణి – రైల్వే శాఖలు సంయుక్తంగా ఈ రైల్వే లైన్ నిర్మిస్తాం : డైరెక్టర్ మనోహర్‌రావు

సింగరేణి సంస్థ – దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా కొత్తగూడెం – సత్తుపల్లి రైల్వే లైన్‌ను నిర్మించనున్నాయని ఆ సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఏ.మనోహర్‌రావు చెప్పారు. మొత్తం అంచనా వ్యయంలో రైల్వే శాఖ, సింగరేణి సంస్థలు చెరిసగం భరించనున్నాయన్నారు. సర్వే నివేదిక ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను బేరీజు వేసుకొని పరస్పరం సంప్రదింపులు జరిపిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌కు నిధులు మంజూరు చేయడం శుభపరిణామమన్నారు. సత్తుపల్లి నుంచి రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా చేయాలని సింగరేణి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని చెప్పారు.

Tags:Kovvur line,bdcr,bdcr to sarhupalli

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

One comment

  1. Can u plz give map where new route to bdcr and sattupalli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *