Papikondalu

చుట్టూ గోదారమ్మ గలగలలు.. పచ్చని ప్రకృతి సోయగాలు.. కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు.. చల్లని గాలులు.. కొండల మధ్య సూర్యోదయం… సూర్యాస్తమయం. రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస.. మధ్యలో క్యాంప్‌ఫైర్‌.. గోదారమ్మ ఒడిలో స్నానం. ఇవి చాలు పాపికొండల యాత్రను వర్ణించడానికి.
యాంత్రిక జీవనంలో పడి అలసిన హృదయాలకు పాపికొండల మధ్య పడవ యాత్ర చక్కని మధురానుభూతిని మిగులుస్తుంది. మన తెలుగు సినిమాల్లోని చాలా పాటల్లో ఇక్కడి అందాలను దర్శకులు మరింత మనోహరంగా వెండితెరపై చూపిస్తుంటారు. తూర్పుకనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణి పాపికొండలు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నడుమ, అటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాను ఆనుకుని ఉన్నాయి.
పాపికొండలు ప్రాంతంలో ఉన్న చెట్లు సాధారణంగా ఆకు రాల్చవు. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం చూసిన పర్యాటకులకు ఆంధ్రా కశ్మీరం అనిపించకమానదు. ఎండాకాలంలోనూ పాపికొండలు ప్రాంతం చల్లగానే ఉంటుంది. భద్రాచలం వద్ద ‘మునివాటం’ అనే ప్రదేశంలో జలపాతం ఉంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి ముగ్ధులవ్వాల్సిందే.పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పుతో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెడుతుంది.
పాపికొండల అడవుల్లో పెద్దపులులు, చిరుత పులులు, నల్లపులులు, అడవిదున్నలు(గొర్రగేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్లు, కొండ చిలువలు,వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్లపందులు, అడవిపందులు, వివిధ రకాల పక్షులు, విషకీటకాలు ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యలకు విరుగుడుగా పనిచేసే వేలాది ఔషధ మొక్కలు ఈ అటవీ ప్రాంతంలో లభిస్తాయి.
ఖమ్మం జిల్లాలోని వరరామచంద్రాపురం(వి.ఆర్‌.పురం)మండలం శ్రీరామగిరిగ్రామం నుంచి సుమారు 3 గంటల పాటు నది ప్రయాణం చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు మధ్య సాగుతూ ఆకట్టుకుంటుంది.
పేరంటాలపల్లి గ్రామంలో బాలానందస్వామి కొలువుదీరిన మునివాటంలో శివుడిని దర్శించవచ్చు. రెండో భద్రాద్రిగా పేరొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీ సుందర సీతారాములవారి దర్శనం కలుగుతుంది. ఎత్తైన కొండల మధ్య సుమారు 170మెట్లు ఎక్కిన తర్వాత సుమారు 500 సంవత్సరాల కిందట మాతంగి మహర్షి ప్రతిష్టించిన శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను దర్శించవచ్చు. ఇక్కడ పక్కనే ఉన్న రెండు ఎతైన పర్వతాలను వాలి, సుగ్రీవుల గుట్టలుగా పిలుస్తారు.
శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటలపాటు ప్రయాణించి గోదావరి తీరాన ఉన్న గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.మూడు గంటలపాటు లాంచీ ప్రయాణం అనంతరం ప్రసిద్ధి చెందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తన్మయత్వానికి గురవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాలా ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. మునివాటం వద్ద ఉన్న శివాలయం పరిసర ప్రాంతాల్లో కొండలపై నుంచి జాలువారే జలపాతం, చుట్టూ పనస, పోక చెక్క లాంటి మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపికొండల ఒంపుసొంపుల మధ్య చిన్న ఏరులా కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండల మధ్య ఒంపు తిరిగి ప్రవహించే గోదావరిని చూస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
* గోదావరి, శబరి నదులలో సంగమమైన శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లి అక్కడి నుంచి లాంచీలో పాపికొండలకు చేరుకోవచ్చు.
ఎలా వెళ్లాలి
* హైదరాబాద్‌ నుంచి పాపికొండలు 450కి.మీ దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం నగరానికి 60కి.మీ దూరంలో ఉంది.
* హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి బస్సు, రైలు, విమానం సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
* పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుంచి యాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి పోలవరం, రాజమండ్రి, కూనవరం, పేరంటాలపల్లి మీదుగా యాత్ర సాగుతుంది.
మరిన్ని వివరాలకు www.telanganatourism.gov.in ఉచిత నంబరు 1800-425-46464కు ఫోను చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
www.aptdc.gov.in చూడవచ్చు. ఉచిత నంబరు లేదా 1800-42545454కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *