Singareni Dependent Jobs Update

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలు జరిపితీరుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిలబెట్టుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను సరైన రీతిలో కల్పిస్తామని చెప్పిన ఆయన తొలినుంచి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఇటీవల సింగరేణి ఏరియాల్లో పర్యటించి కారుణ్య నియామకాలపై త్వరలోనే నిర్ణయం చెప్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్మికుల ఏండ్ల తరబడి నిరీక్షణకు తెర దించుతూ సింగరేణి సంస్థ శనివారం సర్క్యులర్ జారీచేసింది. సర్వీస్‌లో ఉండగా మరణించిన సందర్భంలో లేదా తీవ్ర అనారోగ్య కారణాలతో ఉద్యోగ బాధ్యత నిర్వహించలేని (మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్) పరిస్థితుల్లో కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే విధానం (కారుణ్య)లో నియామకాలు జరుగుతాయని సింగరేణి సంస్థ తన సర్క్యులర్‌లో స్పష్టంచేసింది. 16.03.2017న హైకోర్టు సూచించిన విధానాలకు అనుగుణంగా పలు మార్పులు చేసి, అనుబంధ సర్క్యులర్‌ను విడుదలచేసింది. కారుణ్య నియామకానికి భార్య లేదా భర్త, అవివాహిత కుమార్తె, కుమారుడు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడిని అర్హులను చేసింది. ఒకవేళ వారసులు లేనిపక్షంలో కారుణ్య నియామకం పొందేందుకు సదరు కార్మికుడి సోదరుడు, వితంతు కుమార్తె, వితంతు కోడలు లేదా కార్మికుడి సంపాదనపై ఆధారపడిన అల్లుడు ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుందని స్పష్టంచేసింది.

పురుషులకు భూగర్భ గనిలో బదిలీ వర్కర్‌గా, మహిళలకు గని ఉపరితలం (సర్ఫేస్)లో పనిచేసే అవకాశం కల్పిస్తారు. కారుణ్య నియామకాల విషయంలో ఇదివరకే ఇచ్చిన సర్క్యులర్‌లో ఈ మార్పులు చేస్తూ సింగరేణి సంస్థ అనుబంధ సర్క్యులర్ జారీచేసింది. తాజా సర్క్యులర్ విడుదల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంతో కసరత్తు చేశారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రకటన చేసినా, కొందరు యూనియన్ నాయకులు అడ్డుకోవడంతో అది పూర్తిస్థాయిలో ఆగిపోయింది. దీంతో తాను కార్మికులకు ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లో అమలుచేయాలని భావించిన ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులువేశారు. న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించి, కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా యాజమాన్యానికి మార్గదర్శకాలు జారీచేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చెప్పిన విధంగా సింగరేణి వైద్యులతోపాటు గాంధీ, నిమ్స్ హాస్పిటళ్ల డాక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇక కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైనట్టేనని సింగరేణి ఉన్నతాధికారులు చెప్తున్నారు.

అర్హులు వీరే..

కార్మికుడి భార్య లేదా కార్మికురాలి భర్త, అవివాహిత కుమార్తె, కుమారుడు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు. వారసులు లేనిపక్షంలో సదరు కార్మికుడి సోదరుడు, వితంతు కుమార్తె, వితంతు కోడలు లేదా కార్మికుడి సంపాదనపై ఆధారపడిన అల్లుడు. పురుషులకు భూగర్భ గనిలో బదిలీ వర్కర్‌గా, మహిళలకు గని ఉపరితలం (సర్ఫేస్)లో పనిచేసే అవకాశం.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *