Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు ముందు కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో యాజమాన్యం నిబంధన విధించింది. రెండేళ్ల సర్వీసు లేని కార్మికులు ఎందరో అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరికి నిబంధన ప్రకారం కారుణ్య నియామకం వర్తించదు. ఈ విధానంపై కార్మికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సర్వీసు చివరిరోజున కూడా కార్మికులు అనారోగ్యం బారిన పడినా కారుణ్య నియామకానికి అర్హత ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. యాజమాన్యం రూపొందించిన ఈ నిబంధనను సవాల్‌ చేస్తూ ఈ ఏడాది అక్టోబరు ప్రథమార్థంలో కరీంనగర్‌కు చెందిన చిట్యాల పర్వతాలు అనే కార్మికుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల సింగరేణి యాజమాన్యానికి ఈ ఉత్తర్వులు అందాయి. త్వరలో పిటీషన్‌ విచారణకు రానుంది.

రెండేళ్ల నిబంధన ఎందుకు?..
సింగరేణిలో కారుణ్య నియామకాలపై వైద్య పరీక్షల మండలి ఈ ఏడాది కొత్త సర్వీసు నిబంధనను విధించింది. సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాల కోసం యాజమాన్యం 16 వ్యాధులను అదనంగా చేర్చి సులభతరం చేసింది. అయితే రెండేళ్ల సర్వీసు నిబంధన వల్ల వందలాది మంది కార్మికులు అర్హులు  పొందుతున్నారు. ఫలితంగా వారసత్వంగా ఉద్యోగాలు అందడంలేదు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు మిగిలి ఉండటం తప్పనిసరి కావడంతో చాలామంది ఉద్యోగులు తమకు నష్టం జరుగుతోందని వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్వతాలు సంస్థ విడుదల చేసిన నిబంధనను సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.
అర్హులకూ దక్కని ‘కారుణ్యం’.. వైద్య పరీక్షల కోసం వెళ్లే కార్మికుడు తన అనారోగ్య సమస్యపై రెండేళ్ల సర్వీసుకు ముందే వెళ్లాలన్న నిబంధన రాజ్యాంగానికి విరుద్ధమని పిటీషన్‌దారు పేర్కొన్నారు. రెండేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారు కూడా వైద్య పరీక్షల మండలికి హాజరయ్యే అవకాశం కల్పించాలన్నది అతని వాదన. మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులలో సర్వీసు రెండేళ్ల కంటే తక్కువగా ఉన్నవారివి యాజమాన్యం పక్కన పెడుతోందని, దీనివల్ల కార్మికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. 2011, అక్టోబరు 17న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతీ ఒక్కరిని మెడికల్‌ బోర్డుకు అనుమతించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన హైకోర్టు సింగరేణి ఛైర్మన్‌తోపాటు పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంచాలకులు, పరిపాలన-సంక్షేమం జీఎంతోపాటు సీఎంఓను బాధ్యులను చేస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సింగరేణి తరఫు న్యాయవాది అందుకున్నారు. గతంలో ఉన్న విధివిధానాలపైనా హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత కార్మికుడు అనారోగ్యం బారిన పడితే నష్టపోవాల్సిందేనా అంటూ సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సింగరేణిలో కారుణ్య నియామకాలు కోరుతూ ఇప్పటి వరకు సుమారు 4 వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. మరో వెయ్యి మందికి పైగా ఆశావహులున్నారు. దరఖాస్తు చేసిన వారిలో ఉద్యోగ నియమాకానికి అర్హులైన వారు సుమారు 1300 మంది ఉన్నట్లు గుర్తించిన యాజమాన్యం ఏరియాలు, విడతల వారీగా నియామకాలు చేపడుతోంది. మిగిలిన 2,700 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. వీటిలో సింహభాగం ‘రెండేళ్ల నిబంధన’తో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.

యాజమాన్యం నిర్ణయాల ప్రకారమే నిబంధన
సింగరేణి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇలాంటి సంస్థ యాజమాన్యం నిపుణుల సలహాలతో తన పరిధికి లోబడి పలు స్వతంత్ర నిర్ణయాలను తీసుకునే అధికారం ఉంది. దీనిలో భాగంగా ఈ ఏడాది ‘రెండేళ్ల నిబంధన’ను అమలులోకి తెచ్చాం. సంస్థ నిబంధనల ప్రకారం అర్హులైన సుమారు 1,300 మంది కార్మికులకు కారుణ్య నియామకాలను చేపడుతున్నాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. రెండేళ్ల సర్వీసు నిబంధనలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులందాయి. న్యాయ నిపుణులు, యాజమాన్యం నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.

#Singareni jobs update,#Singareni dependent jobs update

Check Also

kondapuram

New Mine in Singareni-Kondapuram

కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌ గని సింగరేణికే తలమాణికంగా నిలవనుంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించిన నూతన గనులలో ఇది ఒకటి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *