Steel Plant in Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్యాధునికమైన తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమను (ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్-ఈఏఎఫ్) ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. శుక్రవారం రాజధానిలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఐటీ, గనులశాఖల మంత్రి కే తారక రామారావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యే జలగం వెంకట్రావులతో కలిసి కేంద్రమంత్రి మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలోని స్పాంజ్ ఐరన్ పరిశ్రమ 2008 నుంచి మూతపడిందని, అక్కడున్న 450 ఎకరాల స్థలంలో దీనిని పునర్నిర్మాణం చేయాలని భావించా మని తెలిపారు. అందులో భాగంగానే, పూర్తిగా అత్యాధునికమైన ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో 0.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉండగా.. దీనిని 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడిచే ఉక్కు పరిశ్రమగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అక్కడ సాంకేతిక, ఆర్థికపర సానుకూలత ఉండ టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో పనికిరాకుండా పోయిన యంత్రాల స్థానంలో అత్యాధునిక యంత్రాలను నెలకొల్పుతామన్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వంతో జాయింట్ వెంచర్‌గా లేదా పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాల్వంచలో ఏర్పాటుచేస్తున్న ఫ్యాక్టరీవల్ల ఉద్యో గ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు.

మీకాన్ నివేదిక ఆధారంగా బయ్యారం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుందని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ చెప్పారు. అందులో భాగంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకోసం మరోసారి టాస్క్‌ఫోర్స్ కమిటీని వేసినట్టు తెలిపారు. బయ్యారంలో సానుకూలతపై సమగ్ర సర్వే నిర్వహించి, తుది నివేదిక ఇవ్వాలని మీకాన్ సంస్థను ఆదేశించామన్నారు. మీకాన్ తుది నివేదిక ఆధారంగా.. ఎన్‌ఎండీసీ నుంచి ముడి ఇనుము, సింగరేణి నుంచి బొగ్గు, ఇందుకు అవసరమైన రైల్వేలైను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే.. పబ్లిక్ సెక్టార్‌లోగానీ, ప్రైవేటు సెక్టార్‌లోగానీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బయ్యారంలో ఐరన్ ఓర్‌పై పలు దశల్లో జరిగిన సర్వేలు, ప్రయోగాల్లో ఇనుప నిక్షేపాలు సరిపోయినంత లేవని, పైగా నాణ్యతకూడా తక్కువ ఉందని తేలిందన్నారు. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌లో చట్టం రూపొందించి.. తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇచ్చిన హామీ మేరకు, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా తుది సర్వేకు నిర్ణయించామని చెప్పారు.

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *