Bhadrachalam Bhramotsavam from 29th March

శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరగనున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది సందర్భంగా ఉత్సవాలను ఆరంభించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు ఆరంభమయ్యాయి. అప్పటి నుంచి వచ్చే నెల 11 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో ప్రతీ రోజు భక్తులకు పరమానందం కలిగిస్తుంది. తొలి రోజున ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఉంటాయి. పంచాంగ శ్రవణం ఉంటుంది. స్వామివారికి తిరువీధి సేవ చేస్తారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 2న ధ్వజపట మండల లేఖనం చేసి గరుడాధివాసం నిర్వహిస్తారు. 3న అగ్నిప్రతిష్ఠ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ధ్వజారోహణ నిర్వహించి చతుస్థానార్చన జరిపిస్తారు. భేరీ పూజలు జరిపి దేవతాహ్వానం నిర్వహిస్తారు. హనుమంత వాహనంపై రామయ్యకు తిరువీధి సేవ ఉంటుంది. 4న ఎదురుకోలు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక సంబరం కలిగించే వేడుక. ఏటా ఉత్తర ద్వార దర్శనం సమీపంలో ఈ సంబరం జరుగుతుంది. ప్రధాన ఉత్సవానికి ఒక రోజు ముందు జరిగే వేడుక కావడంతో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. 5న శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల వారికి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కల్యాణం జరుగుతుంది. శ్రీరామ పునర్వసు దీక్షలను ప్రారంభిస్తారు. 6న మహా పట్టాభిషేకం చేస్తారు. రాత్రి వేళ జరిగే రథోత్సవం కనులకు పండుగ చేస్తుంది. 7న సదస్యం జరుగుతుంది. వైదిక పెద్దలు ఆశీర్వచనాలు అందిస్తారు. 8న చోరోత్సవంతో పాటు తెప్పోత్సవం జరిపిస్తారు. 9న వూంజల్‌ ఉత్సవం ఉంటుంది. 10న వసంతోత్సవం చేస్తారు. 11న చక్రతీర్థం ఘనంగా జరుగుతుంది. శ్రీపుష్పయాగం చేసి బ్రహ్మోత్సవాలకు సమాప్తి పలుకుతారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 29 నుంచి వచ్చే నెల 11 వరకు నిత్యకల్యాణాలు ఉండవని ఈవో రమేశ్‌బాబు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి 11 వరకు దర్బారు సేవలు ఉండవన్నారు. 1 నుంచి 19 వరకు పవళింపు సేవలు ఉండవు. అన్ని శాఖలు సుమారు రూ.కోటికి పైగా వెచ్చించి ఏర్పాట్లు చేపట్టాయి. ఈ నెలాఖరుకల్లా పనులు చాలా వరకు పూర్తి కానున్నాయి. విద్యుద్దీకరణ, రంగులు, చలువ పందరి నిర్మాణాలు వంటివి కొనసాగుతున్నాయి. 100 క్వింటాళ్ల తలంబ్రాలను 3 లక్షల లడ్డూలను భక్తులకు అందించేందుకు కౌంటర్లను సిద్ధం చేయాల్సి ఉంది. ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తకుండా పార్కింగ్‌ ప్రదేశాలపై ప్రచారం కల్పించాల్సి ఉంది. వసతి సదుపాయం కల్పిస్తారో లేదో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెక్టార్‌ టిక్కెట్లను అంతర్జాలంలో విక్రయిస్తున్నప్పటికీ సరైన ప్రచారం లేక అరకొరగానే విక్రయాలు సాగుతున్నాయి. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాల్సి ఉంది. ఉత్తర ద్వారం లోపలి భాగంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన పూలు పూర్తిగా ఎండిపోయాయి. వీటిని తొలగించి కొత్త వాటిని అలంకరించాల్సి ఉంది. ప్రభుత్వ శాఖలు సమన్వయంగా ఉండి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.

Tags:bhadrachalam,temple,sri ramanavami

Check Also

singareni jobs

Singareni Dependent Jobs update

సింగరేణిలో రెండేళ్ల సర్వీసు వివాదం ముదిరింది. కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకునే కార్మికుడికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *