Geo Thermal powerplant in Manuguru by Singareni

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జియో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ వైపు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు, సౌర విద్యుత్తు కేంద్రాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో జియో థర్మల్‌ కేంద్రం ఏర్పాటుకు కొన్నేళ్లుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పగిడేరు పంచాయతీ గొల్ల కొత్తూరు గ్రామంలో ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల జియో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సింగరేణి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందాయి. ప్రయోగాత్మక కేంద్రం విజయవంతమైతే భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది.

జియో థర్మల్‌ విద్యుత్తు అంటే?

జియో థర్మల్‌ అంటే బోరు బావి నుంచి వచ్చే వేడి నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయటం. ఇది ఏర్పాటు చేయాలంటే భూగర్భంలో వేడి నీటి నిల్వలుండాలి. భూమి లోపల మాగ్నా (సలసల మరుగుతున్న నీరు) ఉంటేనే సాధ్యం అవుతుంది. మణుగూరు మండలంలోని పగిడేరు, బుగ్గ, ఖమ్మంతోగు, గొల్లకొత్తూరు గ్రామాలు, పరిసర అటవీ ప్రదేశాల్లోని భూమి లోపల వేడి నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు జీఎస్‌ఐ సర్వే అధికారులు గుర్తించారు. ఆరు వేడి నీటి బోరు బావులను వారు కనుగొన్నారు. అందులో సింగరేణి బొగ్గు నిక్షేపాల అన్వేషణ కోసం వేసిన బోర్లు నాలుగున్నాయి. 2014లో పగిడేరు అటవీ ప్రదేశంలో జీఎస్‌ఐ అధికారులు వేసిన బోరు నుంచి 81 డిగ్రీల వేడి ఉన్న నీరు బయటకు వచ్చింది. పగిడేరు పరిసర ప్రాంతాల్లో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 600-1000 అడుగుల లోతులో బోర్లు వేయగా వీటినుంచి నిమిషానికి 100 గ్యాలెన్లు (500 లీటర్లు) నీరు బయటకు వచ్చాయి. పగిడేరులో 68, గొల్లకొత్తూరులో 65.6, గ్రామ అటవీ ప్రదేశంలో 81 డిగ్రీల వేడి నీరు ఉన్నట్లు తేలింది. దేశంలో ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో మాత్రమే జియోథర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇది ఏర్పాటు కాలేదు.

సింగరేణి సిగలో.. జీఎస్‌ఐ మణుగూరులో జియోథర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నిర్ధారణ చేశారు. ఇందుకోసం రూ.కోటి వరకు ఖర్చు చేసింది. మణుగూరు ఏరియాలోని ఓసీ-2 గని సమీపంలో వేడి నీటి బోరు బావులు ఉండటంతో రాష్ట్రంలో జియోథర్మల్‌ విద్యుత్తు కేంద్రం తొలిసారిగా ఏర్పాటు చేసే అవకాశం సింగరేణికి దక్కనుంది. కొద్ది రోజుల క్రితం జీఎస్‌ఐ అధికారులు సింగరేణి అధికారులకు అవగాహన కల్పించారు. కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇది కార్యరూపం దాలిస్తే సింగరేణికి మరో విజయం దక్కనుంది.

పర్యావరణ హితంతో.. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వం జియో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తోంది. సౌర, పవన, జల విద్యుత్తు కేంద్రాల మాదిరిగా వీటితో పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు.. బోరు బావి నుంచి వచ్చే వేడి నీటిని విద్యుత్తు ఉత్పత్తి చేసి, మళ్లీ ఆ నీటిని ఇతర అవసరాల కోసం వినియోగించవచ్ఛు ఆ నీటితో కూరగాయలు, పూల తోటలు పెంచవచ్ఛు ప్రస్తుతం గొల్ల కొత్తూరు గ్రామంలో కేంద్రం ఏర్పాటు ద్వారా ఉత్పత్తి చేయదలచిన విద్యుత్తును ఆ గ్రామ అవసరాల కోసం వినియోగించనున్నారు. అంతేకాకుండా గ్రామస్థులకు ఉపాధి కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

Check Also

kondapuram

New Mine in Singareni-Kondapuram

కొండాపురం కంటిన్యూయస్‌ మైనర్‌ గని సింగరేణికే తలమాణికంగా నిలవనుంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించిన నూతన గనులలో ఇది ఒకటి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *